telugu tv
విజయవాడ నగరంలో మధ్య నియోజకవర్గంలో 58 డివిజన్ ప్రజలకు దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధతలేని స్థలంలో గూడు నిర్మించుకుని నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆనందాన్ని పంచే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. నాలుగున్నార దశాబ్దాల తర్వాత ప్రభుత్వ స్థలాల్లో చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్న 51 మంది పేద నివాసితులకు కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ జిఓ నెంబర్ 30 నిబంధనల ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నంబరు 24/10బి, 27/1బి లో 86.39 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 70 కుటుంబాల వారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఆక్రమణ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆఘమేఘాల మీద అమలులోకి తీసుకు రావడంతో పాటు సంక్రాంతి కానుకగా 51 మంది లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. ఇది పేదల ప్రభుత్వమని, పేదల ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అణగారిన వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పి 4 పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను పేద ప్రజలు అందిపుచ్చుకొని తమ తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఇప్పటివరకు శాశ్వతవాసాలు నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్న నివాసితులు ఇకముందు ధైర్యంగా తమ శక్తి మేరకు శాశ్వత నివాసాలు నిర్మించుకోవచ్చని తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో నందమూరి నగర్ నివాసితులు ఈ ప్రాంత స్థలాలకు పట్టాలు కావాలని కోరిన నేపథ్యంలో అప్పుడు వారికి ఇచ్చిన హామీ నేడు నిజం చేశానన్నారు. నియోజకవర్గంలో ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తనదేనన్నారు. సూపర్సిక్స్ హామీలలో భాగంగా చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తున్నామన్నారు.

