telugutv
నేషనల్ క్వాంటమ్ మిషన్‌ను కేంద్రం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్ర బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో జితేంద్రసింగ్ మాట్లాడారు. ఈ పునాది రాయి.. దేశ క్వాంటమ్ మిషన్‌కు మూలం కానుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ త్వరగా అందిపుచ్చుకుంటోంది. డీప్ సీ మిషన్‌కు త్వరగా అనుమతులు ఇచ్చాం. 2024 తర్వాత ప్రతి చోటా క్వాంటమ్ టెక్నాలజీ పదమే వినిపిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా వైద్యరంగంలో పెను మార్పులు వస్తాయి. క్వాంటమ్ మిషన్ అన్ని రంగాల్లో కీలకం కానుంది. అందుకే నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు రూ.6వేల కోట్లు కేటాయించాం అని కేంద్రమంత్రి వివరించారు. ఆవిష్కరణ సమయంలో అన్నీ చిన్నగానే కనిపిస్తాయి. కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది ఆ ఆవిష్కరణల విలువ ఏమిటో అని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్.. కమ్యూనికేషన్లోనూ కీలక మార్పులు తేనుందని కేంద్రమంత్రి తెలిపారు. అమరావతి క్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటుతో టెక్నాలజీ రంగంలో విప్లవం సాధించామని, ఇప్ప్పుడు క్వాంటమ్‌తో మరింత ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇక్కడి పరిశోధనలు ప్రపంచానికి దిక్సూచి అవతాయనడంలో సందేహం లేదన్నారు. ఇకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. అందుకే నా ఆశన్నీ వారిపైనే. చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా యువతకే సాధ్యం. మన యువత సాంకేతిక రంగంలో క్వాంటం వేగంతో దూసుకెళ్తోంది. క్వాంటమ్ ప్రాజెక్టుకు ఇప్ప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే ఉత్పత్తి, సరఫరా చేస్తాం అని వివరించారు. వాజ్‌పేయ్ హయాంలో హైటెక్ సిటీ.. హైదరాబాద్‌కు గేమ్ ఛేంజర్‌గా మారింది. కానీ, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ ఛేంజర్ కానుంది. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడే ఉన్నాయి. వచ్చే 40 ఏళ్ల అవసరాలు దృ ష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం అని చంద్రబాబు అన్నారు. దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. క్వాంటమ్ మిషన్ కార్యకలాపాలు ఏపీ నుంచే ప్రారంభం కావాలని కోరా. టీసీఎస్, ఐబీఎం, ఎలఅండ్టీ ప్రతినిధులతో మాట్లాడా. ఒకట్రెండు నెలల్లోనే ఒప్పందాలు పూర్తి కావాలని కంపెనీలను కోరామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ రావాలని చెప్పా. ఏప్రిల్ 14న ఇక్కడ మరో రెండు క్వాంటమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 2030లోగా 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులు కావాలి. దేశంలోని వందమంది ఐటీ నిపుణుల్లో 35శాతం మంది తెలుగువాళ్లే. క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలు ఏపీకి గేమ్ ఛేంజర్లు కానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేసిన ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. అమరావతి కూడా జితేంధ్ర ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఐటీశా ఖను మంత్రి లోకేశ్ సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 16న బిల్‌గేట్స్ అమరావతికి వస్తున్నారని సీఎం తెలిపారు.

