telugu tv
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల తీరుపైఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆవేదన
చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు “నో వర్క్ – నో పే” పని లేకపోతే జీతం లేదు నిబంధనను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు సంచలన ప్రతిపాదన చేశారు. ఒకవేళ అప్పటికీ తీరు మార్చుకోకపోతే, ప్రజలే వారిని వెనక్కి పిలిపించేలా “రైట్ టు రీకాల్” హక్కును కల్పించాలని లోక్సభ స్పీకర్ను కోరారు.
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న చట్ట సభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ప్రజలపట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం” అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నెలకొన్న పరిస్థితులను ఉదహరిస్తూ గౌరవ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జూన్లో ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది సభ్యులు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభకు హాజరు కాలేదని, కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని ఆయన తెలిపారు. సభకు రాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు, భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇలాంటి అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో చులకన అవుతామని పేర్కొన్నారు.
సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం స్పష్టమైన నిబంధనలు లేనందున, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి మార్గం చూపాలని అయ్యన్నపాత్రుడు గారు కోరారు.
ఆయన ఈ సందర్భంగా రెండు ప్రధాన సూచనలు చేశారు..
ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలు కోత విధించినట్లే, సభకు రాని ప్రజాప్రతినిధులకు కూడా “నో వర్క్ – నో పే” నిబంధన అమలు చేయాలి.
ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే, రాజ్యాంగాన్ని లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే.. వారిని వెనక్కి పిలిపించే “రైట్ టు రీకాల్” హక్కును ఓటర్లకు కల్పించాలి.

