chandrababu today
టూరిజానికే కాదు… టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ
135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనమిక్ రీజియన్
కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ ప్రకటన
విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఏర్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుంది. అప్పటివరకు తాత్కాలిక కార్యాలయంలో కాగ్నిజెంట్ కార్యకాలపాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. కాగ్నిజెంట్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖకూ కాగ్నిజెంట్ అడుగుపెట్టింది. హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ ను ఆహ్వానించాం. త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారు కావాలి. 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కాగ్నిజెంట్ లో 85 శాతం మంది భారతీయులే. ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్ లో నాటి టీడీపీ ప్రభుత్వం రూపోందించిన ఎకో సిస్టంతో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. 3 దశాబ్దాల క్రితం చేసిన విజన్ తోనే దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం ఇస్తున్నారు. 1995లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూషన్ తో పాటు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అందుకే ఐటీకి బ్యాక్ బోన్ గా భారతీయులు నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తున్నాం. ఆ దిశగానే ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోంది.”అని సీఎం వెల్లడించారు.
8 వేలు కాదు… 25 వేలు
కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముందుగా రవికుమార్ తో సీఎం చంద్రబాబు కొద్దిసేపు సంభాషించారు. 8 వేల ఉద్యోగాలు కాదని… విశాఖ క్యాంపస్ లో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమం వేదికగా చంద్రబాబు సమక్షంలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని రవికుమార్ ప్రకటించారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని రవికుమార్ అన్నారు.

