minister pardhasaradhi
పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులు
స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు ప్రభుత్వ హామీ
రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
అమరావతి :
దేశంలోనే పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అనుకూలంగా ఉందని ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు అందిపుచ్చుకుని పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పిలుపునిచ్చారు.
ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లో మూడు రోజుపాటు నిర్వహించే ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్ పో 2025 ను శుక్రవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అందుకు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేవారి కోసం సింగిల్ విండో ద్వారా 21 రోజుల లోపుగానే అనుమతులు ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆయన ప్రతినిధిగా బిజినెస్ ఎక్స్ పో 2025 కు హాజరుకావడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, పెట్టుబడులకు అనుకూల వ్యవస్థ, విజనరీ లీడర్ షిప్ కారణంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రభుత్వం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమలు స్థాపనకు పెట్టుబడిదారులు ఆలోచన చేయగానే వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి మార్గనిర్దేశానికి సింగిల్ విండో విధానంతో ప్రభుత్వం చురుగ్గా అనుమతులు ఇస్తుందన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనటం ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.

