ntr vaidya seva 1
అమరావతి:
కూటమి ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో సానుకూలమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ పథకం కింద కూటమి ప్రభుత్వ పాలనలో భారీగా పెరిగిన వ్యయం మరియు లబ్దిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల అమలును, 108 మరియు 104 సేవలను శనివారంనాడు వర్చువల్ గా సంబంధిత అధికారులతో మంత్రి వివరంగా సమీక్షించారు. 108 సేవలకు సంబంధించిన టెండర్ లో కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా కఠినమైన నిబంధనలు విధించడంతో ఈ సేవలు ఎంతో మెరుగుపడ్డాయని మంత్రి వివరించారు.
పెరిగిన లబ్దిదారులు, వ్యయం
గత వైసిపి ప్రభుత్వం డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను 3,257కు పెంచి పూర్తి స్థాయిలో అమలు పరచిన 2022-23 మరియు 2023-24 కాలంలో ఫలితాలను, గత 19 నెలల కూటమి పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద సాధించిన ఫలితాలను మంత్రి తులనాత్మకంగా విశ్లేషించారు. 2022-24 కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 23,08,930 మంది కింద లబ్దిపొందారు. దీని ప్రకారం సగటున నెలకు 96,205 మందికి ఆరోగ్యశ్రీ సేవలందాయి. కూటమి ప్రభుత్వ పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గతేడాది డిసెంబరు వరకు మొత్తం 24,49,117 లబ్దిదారులకు వైద్య సేవలందాయి. ఈమేరకు సగటున నెలకు 1,16,624 మందికి నగదు రహిత వైద్య సేవలు అందడంతో లబ్దిదారుల్లో 21 శాతం వృద్ధి నమోదైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద నెలకు సగటున రూ.193 కోట్లు ఖర్చు నమోదుకాగా, కూటమి పాలనలో నెలవారీ ఖర్చు రూ.310 కోట్లకు చేరడంతో 60 శాతం పెరుగుదల నమోదైంది. ఈ విధంగా నెలవారీగా రూ.177 కోట్ల అదనపు ఖర్చుతో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఏడాదికి రూ.2,124 కోట్లు ఎక్కువగా వ్యయం చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.
గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం రూ.11,577 కోట్ల ఖర్చు నమోదు చేయగా, కూటమి ప్రభుత్వం గత 19 నెలల్లోనే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.6,530 కోట్ల వ్యయాన్ని నమోదు చేసింది. ఈ వ్యయం గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో చేసిన మొత్తం వ్యయంలో 56 శాతం.
ఈ విధంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెరుగుతున్న ఖర్చు, లబ్దిదారుల సంఖ్య ఈ పథకం అమలు పట్ల ప్రజల సానుకూల వైఖరికి అద్దంపడుతుందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలును, ఫలితాలను ముఖ్య కార్య నిర్వాహక అధికారి(సిఇఓ) శ్రీ కొత్తమాసు దినేష్‌కుమార్, ఇతర అధికారులు మంత్రికి వివరించారు.
కూటమి ప్రభుత్వ వైఖరితో 108 సేవల్లో సత్ఫలితాలు
గత ప్రభుత్వ హయాంలో అరబిందో ఎమెర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంస్థ 108 సేవలను అందించడంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గతేడాది జూన్‌లో ఈ సేవల్ని భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు టెండరు ప్రక్రియ ద్వారా అప్పగించింది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం కఠినమైన టెండర్ నిబంధనల్ని రూపొందించింది. పర్యవసానంగా 108 సేవల్లో సానుకూల ఫలితాలొస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.
గతేడాది జూన్ నుంచి 108 వాహనాలు అగ్రిమెంట్లో పొందుపర్చిన నిమయ నిబంధనల మేరకు రోగులకు చేరుతున్నాయని, ముఖ్యంగా గోల్డెన్ అవర్ (108 వాహనం కోసం ఫోన్ కాల్ వచ్చినప్పట్నించి గంటలోగా రోగిని ఆసుపత్రికి చేర్చడం) విషయంలో సత్ఫలితాలొస్తున్నాయని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ కాల్ వచ్చినప్పట్నించి 18 నిమిషాల్లో 108 వాహనం రోగి వద్దకు చేరాల్సి ఉండగా ఇప్పటి వరకు సగటున కేవలం 37 సెకన్ల ఆలస్యంతో ఆ వాహనాలు రోగుల వద్దకు చేరుతున్నాయని అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 23 నిమిషాలుగా నిర్దేశించబడగా సగటున కేవలం 13 సెకన్లు మాత్రమే ఆలస్యం అవుతోందని, గిరిజన ప్రాంతాల్లో 33 నిమిషాల్లో 108 అంబులెన్సులు రోగుల వద్దకు చేరాల్సి ఉండగా సగటున 2 నిమిషాల 34 సెకండ్లు ముందే చేరుతున్నాయని అధికారులు తెలపగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
దీనికి భిన్నంగా గత ప్రభుత్వ హయాంలో 108 వాహనాలు పట్టణ ప్రాంతాల్లో సగటున 12 నిమిషాల 45 సెకండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 12 నిమిషాల 39 సెకండ్లు, గిరిజన ప్రాంతాల్లో 9 నిమిషాల 30 సెకండ్లు ఆలస్యంగా చేరాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 731 అంబులెన్సులు(108) నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని నిబంధన ఉన్నా సగటున కేవలం 612 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.
కూటమి ప్రభుత్వం రూపొందించిన నియమం మేరకు ప్రస్తుతం 108 వాహనాల ద్వారా 95.58 శాతం రోగులు సగటున 1 గంట 5 నిమిషాల్లో ఆసుపత్రులకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు. గతంలో ఈ నిబంధన లేనందున కేవలం 15 శాతం రోగులు సగటున 1 గంట 57 నిమిషాల్లో ఆసుపత్రులకు చేరగలిగేవారని వారు వివరించారు.
గత ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు
గత ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్సుల పనితీరుపై కాగ్ తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు అధికారులు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. అంబులెన్స్ కోసం ఫోన్ కాల్ వచ్చినప్పట్నించి నిర్దేశించిన సమయంలో అవి రోగులకు చేరలేదని, ఈ అంబులెన్సుల్లో వివిధ పరికరాలు ప్రమాణాల మేరకు పనిచేయలేదని, సిబ్బంది నియామకంలో కొరత ఉందని, ఏసీలు పనిచేయలేదని, క్రిటికల్ కేసుల్ని అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టంతో కూడిన అంబులెన్స్‌లో కాకుండా కనీస సౌకర్యాలు మాత్రమే ఉన్న వాహనాలను కేటాయించారని గతేడాది జూన్‌లో కాగ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు ప్రతిరోజూ సగటున 200 ఎమెర్జెన్సీ టెలిఫోన్ కాల్స్ కు అరబిందో సంస్థ స్పందించేది కాదని అధికారులు మంత్రికి వివరించారు.
పూర్తిస్థాయిలో సేవలందిస్తున్న 108 వాహనాలు
గతంలో 108 సేవల్ని నిర్వహించిన అరబిందో సంస్థ వాహనాలకు తగు సమయంలో అవసరాల మేరకు మెయింటెనెన్స్ చర్యలు చేపట్టకపోవడంతో 42 వాహనాలు రిపేరుకు కూడా పనికిరాకుండా పోవడం, 615 అంబులెన్సులకు మేజర్ రిపేర్లు, 103 వాహనాలకు మైనర్ రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు 190 కొత్త అంబులెన్సులను ప్రస్తుత ఏజెన్సీ సమకూర్చాల్సి వచ్చింది. వెరసి ఈ ఏడాది జూన్‌లో మొత్తం 768 వాహనాల్లో 67 శాతం మాత్రమే వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. తగు చర్యల ద్వారా పనిచేసే అంబులెన్స్ సంఖ్యను క్రమేణా పెంచుతూ ఈ ఏడాది నవంబరు నాటికి వంద శాతం 108 అంబులెన్సుల ద్వారా సేవలందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
108 టెండర్:కఠిన నిబంధనలు
1) 108 సర్వీసుల టెండర్ కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం కఠిన నిబంధనల్ని అమలు చేసింది. గత ప్రభుత్వం 50 కంటే తక్కువ 108 అంబులెన్సులు నడిపిన అనుభవం ఉన్నవారికి అవకాశాన్ని కల్పించగా కూటమి ప్రభుత్వం కనీసంగా 100 అంబులెన్సులు నడిపిన అనుభవం ఉండాలన్న నిబంధనను పెట్టి 800 వాహనాలను నడిపిన అనుభవం కలవారిని ప్రోత్సహించే విధంగా నిబంధనలు రూపొందించింది.
2) గత టెండర్ సమయంలో గత మూడేళ్లలో ఏడాదికి అంబులెన్సులు నడపడంద్వారా రూ.25 కోట్లు ఆదాయం ఉన్నవారికి అర్హత కల్పించగా కూటమి ప్రభుత్వం దీన్ని కనీసంగా రూ.100 కోట్ల మేరకు పెంచి అంతకంటే ఎక్కువ ఆదాయం చూపిన వారికి ప్రోత్సాహకాలు కల్పించింది.
3) గత ప్రభుత్వం ఒక్కో అంబులెన్స్‌కు ఒక ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు డ్రైవర్‌ను నియమించాలని నిబంధన పెట్టగా కూటమి ప్రభుత్వం ఒక్కో అంబులెన్స్‌కు ఇద్దరేసి చొప్పున టెక్నీషియన్లు మరియు డ్రైవర్లు ఉండాలనే నియమం పెట్టింది.
4) అరబిందో సంస్థకు టెండర్ కేటాయించినప్పుడు గత ప్రభుత్వం గోల్డెన్ అవర్ నిబంధన పెట్టలేదు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం టెలిఫోన్ కాల్ వచ్చిన గంటలోపే రోగిని 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించాలని నిబంధన పెట్టింది
104 వాహనాల ద్వారా విస్తృత ప్రయోజనాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు 104 వాహనాల ద్వారా త్వరలో ప్రతి ఒక్కరికీ 41 రకాల వైద్య పరీక్షలు చేసే ప్రక్రియను చేపడతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈమేరకు జరుగుతున్న సన్నాహకాల గురించి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, 108 మరియు 104 వాహన సేవలు ఎంతో కీలకమైనవని, వీటి అమలు, నిర్వహణ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన సేవల్ని అందించాలని మంత్రి ఆదేశించారు

