Telugu Tv
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెరిట్ సీట్లు లేకుండా చేసింది గత పాలకులే?
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై 18 నెలల కాలంలో దాదాపు రూ. 50 వేల కోట్లు ఖర్చు
ఒక్కో ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడుతున్నాం
సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ,డిసెంబరు 23:
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.స్థానిక ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పీపీపీ అనేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విధానంగా మంత్రి అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్‌ను విమర్శించడం సరికాదు. గత ప్రభుత్వం 17 కాలేజీలు తెచ్చామని గొప్పలు చెప్పుకుందని కానీ, కేవలం దాదాపు రూ. 600 కోట్లు ఖర్చు చేసి 8,500 కోట్ల ప్రాజెక్టును గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన పీపీపీ విధానం వల్ల 50% సీట్లు మెరిట్ ప్రాతిపదికన కేవలం రూ. 15,500 ఫీజుతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కుతాయన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల కేవలం 35% సీట్లు మాత్రమే మన విద్యార్థులకు అందేవని, ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతుందన్నారు. పీపీపీ టెండర్లలో పాల్గొంటే జైలుకు పంపిస్తామనే విపక్షం బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరుతున్నారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాబిన్నం చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే 32% అదనంగా అప్పులు చేసిందని స్వయంగా కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్‌కు వెలుపల, కార్పొరేషన్ల పేరుతో విచక్షణారహితంగా అప్పులు చేసిందని అన్నారు.. అప్పు తెచ్చిన నిధులను మూలధన వ్యయం కోసం కాకుండా కేవలం ఇతర ఖర్చులకే వినియోగించారని తెలిపారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏ నాగరికత అభివృద్ధి అయినా రోడ్లపై కనిపిస్తుందని అంటారని, కానీ గత ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులను, కొత్త రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.
డ్రైనేజీ కాలువలు, కాలువల నిర్వహణ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, దీనివల్ల వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందన్నారు. చింతలపూడి ప్రాజెక్టు 7-8 వేల కోట్లతో పూర్తి అయ్యే అవకాశం ఉన్నా అప్పటికే 4 వేల కోట్లు ఖర్చు చేసినా, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారనే కారణంతో నిలిపివేశారన్నారు. దీనివల్ల 2.5 లక్షల ఎకరాల సాగు నీరు, లక్షల మందికి తాగు నీరు అందకుండా పోయిందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 18 నెలల కాలంలో దాదాపు 50 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికే చదువుకునే ఆడ పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తే, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఆడ పిల్లలు ఉంటే అంతమందికీ “తల్లికి వందనం” పథకాన్ని వర్తింపజేస్తోందన్నారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయూడబ్లూజే, ఐజేయూ నాయకులు ఐవీ సుబ్బారావు, కంచల జయరాజు, సోమ సుందర్, చావా రవి, వెంకటేశ్వర్లు, దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, ఏచూరి శివ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

