ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకే పట్టం
ఏపీలో అధికారం టీడీపీదే
కాదు వైసీపీదే అంటున్న మరికొన్ని సర్వేలు
ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం
కూటమిదే పీఠం?
తెలుగు ట్రాక్,విజయవాడ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. మెజారిటీ సంస్థ ఎన్డీయే కూటమికి అధికారం దక్కుతుందని చెబుతుండగా.. కొన్ని సర్వేలు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పాయి.అధికార పక్షానికి చెందిన మంత్రుల్లో చాలా మంది ఓడిపోతారని దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తూనే చంద్రబాబు,లోకేష్,పవన్ లాటి నేతలు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పాయి.అదే సంస్థ మంత్రులు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంటారని మరో విషయాన్ని చెప్పింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన సర్వే సంస్థలు రెండు గ్రూపులుగా విడిపోయి వారి అభిప్రాయాలను ఎగ్జిట్ పోల్ రూపంలో చెప్పి తెలుగు ప్రజలను అయోమయానికి గురి చేశాయి.
ఏపీలో మొత్తం 175 శాసన సభ, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అధికార వైఎస్సార్సీపీ మొత్తం 175 శాసన సభ, 25 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించింది. ఇక ఎన్డీయే కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. పొత్తులో భాగంగా టీడీపీ 141 శాసన సభ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక బీజేపీ 13 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు ఇండియా కూటమిగా పోటీ చేశాయి.
ఏపీలో ఈసారి టీడీపీ కూటమిదే అధికారమా?. లేదా వైసీపీకే మళ్ళీ పట్టం కట్టారా?. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి గెలుచుకునే సీట్లు ఎన్ని?చంద్రబాబు కు మెజార్టీ ఎంత వస్తుంది? పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఈ సారి అసెంబ్లీలో అడుగుపెడతారా?. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి ?. బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది ?. కడప ఎంపీ స్థానంలో షర్మిల గెలిచి సంచలనం సృష్టిస్తారా?. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ప్రజల్లో ఉన్న ఈ ప్రశ్నలన్నిటికీ అసలైన సమాధానం కావాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే..