yuva 2025

• యువతలో నైపుణ్యాలు వెలికితీయడమే ప్రధాన లక్ష్యం
- యువజన సేవల శాఖ కమిషనర్ శ్రీమతి భరణి
యువతలో నిక్షిప్తమైన నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం యువ -2025 లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్. భరణి తెలిపారు.
రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర యువజన మహోత్సవం యువ- 2025 నిర్వహణపై గురువారం స్థానిక ఇందిరా గాందీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో యువజన సేవల శాఖ కమిషనర్ శ్రీమతి ఎస్. భరణి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీమతి ఎస్. భరణి మాట్లాడుతూ ఈ నెల 18, 19 & 20 తేదీలలో వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీ లో రాష్ట్ర స్థాయి యువజన మహోత్సవాలను “యూత్ ఫర్ స్వర్ణాంధ్ర” థీమ్ తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ థీమ్ ముఖ్యంగా యువత ఆలోచనలు, ప్రతిభ, సృజనాత్మకత రాష్ట్ర అభివృద్ధికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర యువజన ఉత్సవాలను నిర్వహించి తద్వారా రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతికి వారిని ఎంపిక చేసి విజేతలను ఢిల్లీలో నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొనడానికి పంపడం జరుపుతుందన్నారు.
15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబడతాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన మొదటి బహుమతి విజేతలు రాష్ట్ర స్థాయి ఈవెంట్లలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి విజేతలను జాతీయ యువజనోత్సవం-2026లో పాల్గొనడానికి పంపిస్తామన్నారు. అన్ని జిల్లాల నుండి దాదాపు 700 మంది యువత పోటీల్లో పాల్గొంటారని భావిస్తున్నామన్నారు.
భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జానపద నృత్య బృందం, జానపద పాటల బృందం, పెయింటింగ్, ప్రకటన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ (సైన్స్ మేళా ప్రదర్శన) ఏడు ఈవెంట్లలో పోటీలు నిర్వహించబడతాయన్నారు.. 2025 డిసెంబర్ 18 నుండి 20 వరకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కె.ఎల్. విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్ర యువజనోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందిన వారికి పోటీలు నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో విజేతలకు మొదటి, రెండవ బహుమతి విజేతలకు సర్టిఫికెట్, జ్ఞాపిక తోపాటు పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయబడతాయన్నారు. యువతను ఈ మహోత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొని, నేర్చుకుని, కలిసి పనిచేసి అభివృద్ధి చెందాలన్నారు.
రాష్ట్ర యువజన మహోత్సవం యువ-2025 లో యువత కోసం ప్యానెల్ డిస్కషన్, యూత్ కాన్ (Youth Con), యూత్ ఇంఫాక్ట్ ల్యాబ్స్ (Youth Impact Labs) లను ఏర్పాటు చేస్తారన్నారు. 26 జిల్లాల బృందాలతో జరిగే గ్రాండ్ కార్నివల్ పరేడ్ తో మహోత్సవం ప్రారంభమవుతుందని, వివిధ విభాగాల్లో 2,000కు పైగా ఎంపికచేయబడిన యువత పాల్గొననున్నారన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఢిల్లీలోని పాలసీ నిపుణులు, ప్రముఖ వైద్యులు, సివిల్ సర్వెంట్స్, సోషనల్ ఎంటర్ ప్రెన్యూర్స్ పాల్గొననున్నారు. యువతకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి CII,I-WIN, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంధ సంస్థలు, కమ్యునిటీ ఆర్గనైజేషన్స్ భాగస్వామ్యం అయ్యారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు డయాస్పోరాలోని ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన డిజిటల్ మారథాన్ #AndhraYuvaSankalp2k25 ఫైనల్స్, బహుమతుల కార్యక్రమం ఉంటుందన్నారు.
యువత “స్వర్ణాంధ్ర లక్ష్య పాదనలో, వికసిత్ భారత్ నిర్మాణంలో ఇంటెలెక్సువల్ వారియర్స్ గా తయారై స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనకు కృషిచేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు ఆకాంక్షించారని కమిషనర్ శ్రీమతి భరణి తెలియజేశారు..అనంతరం యువజన మహోత్సవం యువ -2025 ఈవెంట్ కర్టెన్ రైజర్ ను ఆవిష్కరించారు..
సమావేశంలో ఏపీ యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల సీఈవో యూ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

